

సీనియర్ నటి టబు ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాలకు పైగా భారతీయ సినిమాల్లో విభిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, యష్ రాజ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టన్నెల్ మెన్’ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆమె నటించనున్న తొలి హిందీ ఒరిజినల్ స్ట్రీమింగ్ సిరీస్‌గా చెప్పుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్న కథల్లోనూ తన నటనతో ఆకట్టుకున్న టబు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఆసక్తి పెరిగింది.
2023 నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోవడంతో అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘టన్నెల్ మెన్’ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ది రైల్వే మెన్’ సిరీస్‌కు దర్శకత్వం వహించిన శివ్ రావైల్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు. యష్ రాజ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ హెడ్ సౌగత ముఖర్జీ పర్యవేక్షణలో ఈ సిరీస్ రూపొందుతోంది. టబు పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!