

దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలపై నటి తమన్నా భాటియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ, దక్షిణాది చిత్రసీమల్లో పని విధానం, పాత్రల ఎంపికలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయని చెప్పారు. హిందీలో నటీనటులకు విభిన్న కథలు, పాత్రలను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని, దక్షిణాదిలో మాత్రం కమర్షియల్ సినిమాలు, గ్లామర్, స్టార్ ఇమేజ్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీనిని ఏ పరిశ్రమపై విమర్శగా చూడొద్దని, తాను అనుభవించిన వాస్తవాలను మాత్రమే పంచుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రతి పరిశ్రమకు తనదైన ప్రత్యేకత ఉంటుందని, వాటి పని తీరు కూడా భిన్నంగా ఉంటుందని వివరించారు. మంచి కథలతో పాటు ప్రేక్షకులను అలరించే కమర్షియల్ చిత్రాలూ సమానంగా అవసరమని అభిప్రాయపడ్డారు.
ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఈ అభిప్రాయాలను వెల్లడించారు. నటిగా తనకు సవాల్ విసిరే పాత్రలు చేయాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుందని, అదే సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ చిత్రాల్లో భాగం కావడం కూడా ఆనందాన్నిస్తుందని చెప్పారు. ఇటీవల విడుదలైన స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ పాటకు వచ్చిన విశేష ఆదరణ తన కెరీర్‌లో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచిందన్నారు. ఆ పాటకు దేశవ్యాప్తంగా లభించిన స్పందన తనపై కొత్త బాధ్యతను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తమన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!