

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువతి వ్యోమగామి కావాలనే కల, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెకు అండగా నిలిచే వ్యక్తి.. ఈ కథాంశంతో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’, మరో చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’ రెండింటిలోనూ ప్రధాన కథాంశం దాదాపు ఒకే తరహాలో ఉండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ‘డియర్ ఆస్ట్రోనాట్’ ఆలోచనకు 2021లోనే బీజం పడింది. ఎన్నారై కార్తిక్ భాగ్యరాజ్ ‘కౌగిలి’ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. వ్యోమగామి కావాలని కలలు కనే యువతి చుట్టూ అల్లుకున్న ఈ కథకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఆ కథను మరింత విస్తరించి పూర్తి నిడివి సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయించడంతో ‘డియర్ ఆస్ట్రోనాట్’ రూపుదిద్దుకుంది.
ఈ సినిమాలో సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించగా, మనస్విని భాగ్యరాజ్ నిర్మించారు. నవంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా ప్రేమ, ఆశయం, పట్టుదల నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తిగా కనిపించనున్నారు. తనను ప్రేమించిన యువతి వ్యోమగామి కావాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆయన అండగా నిలుస్తారు. ఈ సినిమా కూడా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక యువతి కలను సాకారం చేయడంలో ప్రేమ, కుటుంబం, ప్రోత్సాహం ఎంతటి పాత్ర పోషిస్తాయనే అంశాన్ని ఈ రెండు చిత్రాలు తమదైన శైలిలో చూపించనున్నాయి. ఒకే తరహా ప్రధాన కథాంశంతో వస్తున్న ఈ సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!