

దర్శకుడు వెంకట్ ప్రభు, హీరో శివకార్తికేయన్ కాంబినేషన్‌లో రావాల్సిన ‘ఎస్‌కే 27’ ప్రాజెక్ట్ ఆగిపోవడంపై జరుగుతున్న ప్రచారానికి వెంకట్ ప్రభు స్పందించారు. వీరిద్దరి మధ్య విభేదాల కారణంగానే సినిమా నిలిచిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. శివకార్తికేయన్ మరో దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణతో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. శివకార్తికేయన్ తనకు ఎప్పుడూ మంచి స్నేహితుడు, తమ్ముడి లాంటి వాడేనని స్పష్టం చేశారు. సినిమా ఆలస్యం కావడంతో అసహనం కలగడం సహజమేనని, అయితే పూర్తి పరిస్థితులు తెలియకపోవడం వల్లే ఏదైనా జరిగి ఉండొచ్చని, అందుకే శివకార్తికేయన్‌ను తప్పుపట్టలేనని తెలిపారు.
తాను వృత్తిపరమైన విషయాల్లో సాధారణంగా మౌనంగా ఉంటానని, శివకార్తికేయన్‌తో సహా ఎవరితోనూ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను లోతుగా చర్చించనని వెంకట్ ప్రభు చెప్పారు. కొన్ని కారణాల వల్ల ‘ఎస్‌కే 27’ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. సరైన సమయంలో మంచి కథ కుదిరితే భవిష్యత్తులో శివకార్తికేయన్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పుకార్లకు ఇకనైనా ముగింపు పలకాలని కోరిన వెంకట్ ప్రభు.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు. అలాగే తన సోదరుడి కుమారుడు సెయోన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!