

కోలీవుడ్ నుంచి ఈ ఏడాది అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘బ్లాస్ట్’ ఒకటి. దర్శకుడు సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామాలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రలు పోషించారు. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బలమైన మౌత్ పబ్లిసిటీతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. యాక్షన్‌కు భావోద్వేగాలను జోడించిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. థియేటర్లలో విజయవంతమైన ప్రయాణం ముగిసిన తర్వాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
డిజిటల్ విడుదల తర్వాత కూడా ‘బ్లాస్ట్’కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించడంతో మరింత మంది వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు 4.4 మిలియన్ వ్యూస్ సాధించినట్లు సమాచారం. దీంతో థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికలోనూ ఇదే జోరు కొనసాగిస్తున్న చిత్రంగా నిలిచింది. యాక్షన్ ప్రధానంగా ఉన్నప్పటికీ కథలోని భావోద్వేగాలు, నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం సినిమాకు అదనపు బలంగా మారాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్పందనతో ‘బ్లాస్ట్’ ఈ ఏడాది కోలీవుడ్ నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల జాబితాలో మరింత బలమైన స్థానం సంపాదించుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!