

‘35 చిన్న కథ కాదు’ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న నటి నివేదా థామస్, ‘శ్రీమతి’ అనే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు తిరువీర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో నివేదా థామస్ మధుశ్రీ అనే మధ్యతరగతి గృహిణిగా కనిపించనున్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఆమె పడే తపన, ఎదుర్కొనే సవాళ్లు, తీసుకునే నిర్ణయాల చుట్టూ ఈ కథ సాగుతుంది. దర్శకుడు విశ్వక్ ఖండేరావు ప్రతి మహిళ జీవితంలో ఉండే కలలు, ఆశలు, భావోద్వేగాలు, వ్యక్తిగత ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథ ప్రతి తెలుగింటి మహిళకు దగ్గరగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది.
తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన నివేదా థామస్, ‘ప్రతి శ్రీమతి వెనుక ఒక కథ ఉంటుంది. ఈ శ్రీమతి కలలు, ఆశలు, జీవిత ప్రయాణం ఏమిటో తెలుసుకుందాం’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. టీజర్‌లో నివేదా థామస్ పలికించిన భావోద్వేగాలు, తిరువీర్ సహజమైన నటన ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 4 నుంచి ‘శ్రీమతి’ సినిమా జీ5 వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!