

అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల చోరీ వ్యవహారంలో చర్యలు తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ ఘటనలో పాత్ర ఉన్నవారిని కాపాడుతున్నది ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని, ఈ వ్యవహారానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. అభివృద్ధి పేరుతో అయోధ్య వాసుల నుంచి భూములు సేకరించినప్పటికీ, వారికి తగిన పరిహారం అందించకుండా అవమానించారని విమర్శించారు. ఇటీవల 1990లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరసేవకులపై జరిగిన కాల్పుల ఘటనకు బాధ్యులు క్షమాపణ చెప్పాలని సీఎం యోగి డిమాండ్ చేశారు. త్వరలో అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుంటానని అఖిలేశ్ ప్రకటించడంపై స్పందిస్తూ, అయోధ్యను నిర్లక్ష్యం చేసినవారు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే దర్శనానికి రావాలని యోగి వ్యాఖ్యానించారు.
సీఎం వ్యాఖ్యలకు స్పందించిన అఖిలేశ్ యాదవ్, రామమందిర విరాళాల చోరీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ యోగి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. నగదు విరాళాలను లెక్కించే సమయంలో డబ్బును దారి మళ్లించారనే ఆరోపణలతో నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుల నుంచి పోలీసులు రూ.79.85 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!