

కర్ణాటక ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఫారమ్ 7 దరఖాస్తులను భారీగా దాఖలు చేశారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కేబినెట్ సహచరులు, కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి. అన్బుకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల వివరాలు, ఈపిక్ నంబర్లు ముందుగానే ఉన్న ఫారమ్‌లు పెద్ద సంఖ్యలో వినియోగించారనే ఫిర్యాదులను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫారమ్‌లు ఎక్కడ ముద్రించారు, ఎలా రూపొందించారు, ఎవరు పంపిణీ చేశారనే అంశాలపై విచారణ జరగాలని శివకుమార్ కోరారు.
మరోవైపు ఫారమ్ 6, 6A, 7, 8లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు లేదా డిక్లరేషన్లు చేసినట్లు విచారణలో తేలితే, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 31 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఇందుకు ముందు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని రూల్ 20 ప్రకారం విచారణ జరపాలని సూచించారు. మరణం కారణంగా పేరు తొలగింపు కోరే దరఖాస్తులకు మరణ ధ్రువీకరణ పత్రం, డూప్లికేట్ ఎంట్రీగా పేర్కొనే సందర్భాల్లో రెండో ఈపిక్ నంబర్‌ను నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫారమ్ 7 దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం విచారణకు లోబడి ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!