

గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్, పీసీసీ అధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటారని తెలిపారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను ఈ అంశంపై మాట్లాడబోనని స్పష్టం చేశారు. మెటా సంస్థ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారనే విషయం తనకు తెలియదని చెబుతూనే, ఆ సంస్థ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెబుతున్న వ్యాఖ్యలను చామల ఎద్దేవా చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయంగా ఆట ఆడలేకపోతున్నారని విమర్శించారు. హరీష్ రావు, కేటీఆర్ చెప్పిన విషయాలనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని, స్క్రిప్ట్ బీఆర్ఎస్‌దైతే ప్రజెంటేషన్ బీజేపీదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పెట్టుబడులు రావడం, మూసీ అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో విస్తరణపై బీజేపీ వైఖరిని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నారా అని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలను కూడా తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ నేతలకు నిజంగా ఆసక్తి ఉందా అని ప్రశ్నించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!