

తన కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు. తండ్రి వయసున్న వ్యక్తికి పెళ్లి శుభలేఖ అందిస్తే ఆత్మీయ సంబంధాలు అంటగడతారా? అంటూ ప్రశ్నించారు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనం రాశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేయడం, కుటుంబ సంబంధాలకు తప్పుడు అర్థాలు ఆపాదించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆత్మీయంగా వివాహానికి ఆహ్వానించడంలో కూడా రాజకీయ కోణం వెతకడం సరికాదని షర్మిల విమర్శించారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పిల్లల వివాహాలకు చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన విషయాన్ని షర్మిల గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబు వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదిస్తే, వారిద్దరి మధ్య ప్రత్యేక సంబంధాలు ఉన్నట్లు భావించాలా? అని ప్రశ్నించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. తనకు చెందిన పత్రికలో మహిళపై ఇలాంటి కథనాలు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ కథనంపై జగన్ సమాధానం చెప్పాలని, తప్పుడు కథనాలకు వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!