

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సెప్టెంబర్ 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరో వదిలిన బాణంగా అభివర్ణిస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. తాను బహుజనుల బాణాన్ని అని పేర్కొన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే ఆశయాల ఆధారంగా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. మోదీ, రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లతోనూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయాన్ని తమ రాజకీయ కార్యాచరణలో ప్రధాన అంశాలుగా కవిత వివరించారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, యువత వ్యాపార ఆలోచనలకు అనుగుణంగా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానం తీసుకొస్తామని చెప్పారు. జూరాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 2009లో కోస్గిలో చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకున్న కవిత.. భవిష్యత్తులో తెలంగాణను నడిపించే అవకాశం తనకు వస్తుందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!