

బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఉదయం నుంచే అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు హౌస్ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డి సహా పలువురు నేతల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. నేతలను ఏ కారణంతో అరెస్టు చేస్తున్నారో రాష్ట్ర డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ధర్నాలు, నిరసనలు చేసేందుకు కాకుండా చట్టబద్ధంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి వినతిపత్రం సమర్పించేందుకే వెళ్తున్నామని స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్ వద్ద అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేఆర్‌ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేసి, బోర్డుకు వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!