

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఆర్ ట్యాక్స్ అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లోని బిల్డర్లు, డెవలపర్లను అడిగితే ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్ల వాస్తవం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, రాష్ట్రంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ హైదరాబాద్‌కు వస్తున్నప్పటికీ, ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని మోదీ తన ఏబీవీపీ చోటా భాయ్‌గా భావిస్తున్నారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల విమర్శలు మాటలకే పరిమితమవుతున్నాయని, కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని ఆరోపించారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ వ్యవహారంపై మోదీ, అమిత్ షా వైఖరి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!