

తెలంగాణ మంత్రులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పదవుల్లో కూర్చున్న వారు ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. ఆ పదవులను ఉపయోగించుకుని దొంగలకు, కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను న్యాయబద్ధంగా అర్హులైన వారికి అందించేలా మంత్రులు పనిచేయాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంత్రులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటని, ప్రస్తుతం ఎలాంటి పాలన అందిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతి లేకుండా నిజాయితీగా పాలన చేస్తున్నామని మంత్రులు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అని నిలదీశారు. అహంకారంతో మాట్లాడటం మానుకుని ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే సమయం కేటాయించకుండా, ప్రభుత్వ నిర్వహణపై దృష్టి సారించాలని మంత్రులకు హితవు పలికారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!