

ఎల్‌నినో ప్రభావం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో రూ.5,420 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ మంత్రులు సీహెచ్ లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దసరా, దీపావళి పండగల సమయంలో ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేసిన మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన తర్వాత తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ముగింపు పలకాలని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని హరీశ్‌రావు అన్నారు. 2016-17 నుంచి 2021-22 వరకు రూ.12,718.40 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు విధించాలని విద్యుత్ నియంత్రణ మండలి సూచించినప్పటికీ, ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు అనుమతించలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలోకి వెళ్లాయని, ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఈ పోరాటానికి సీపీఐ, సీపీఎంలు కలిసి రావాలని హరీశ్‌రావు కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!