

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 76 స్థానాలను తెదేపా నేతృత్వంలోని కూటమి దక్కించుకుంది. తెదేపాకు 71, జనసేనకు 2, భాజపాకు 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌సీపీకి ఒక స్థానం దక్కింది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కూటమి రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఒక్కరే పోటీలో మిగలడంతో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. కడప జిల్లాలో 39 స్థానాలకు గాను 23, పల్నాడు జిల్లాలో 28 స్థానాలకు గాను 18 స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఏడు జడ్పీటీసీ స్థానాలకు గాను మూడింటిని తెదేపా ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మాచర్ల, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లి నియోజకవర్గాల్లోనూ ఐదేసి స్థానాలను తెదేపా గెలుచుకుంది. వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, పెదకూరపాడు, కోవూరు, శ్రీకాళహస్తి, పూతలపట్టు, గుంతకల్లు తదితర నియోజకవర్గాల్లోనూ ఏకగ్రీవాలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలోని ప్యాపిలి జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మరికొన్ని స్థానాల్లో జనసేన, భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!