

సంక్రాంతి తర్వాత కొడంగల్ నుంచి ‘ప్రజాబలం’ కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సునామీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో సోమవారం నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’లో ఆయన ప్రసంగించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎవరైనా అడ్డుకున్నా వెనక్కి తగ్గబోనని, 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చి పచ్చని పొలాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని అడ్డుకుంటామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కొడంగల్‌కు నీళ్లు వస్తే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సుమారు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఎడ్యుకేషన్ హబ్, పారిశ్రామికవాడలు, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కొడంగల్ వరకు 250 అడుగుల వెడల్పుతో రేడియల్ రోడ్డు నిర్మాణం వంటి ప్రాజెక్టుల ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ హయాంలో రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడిందన్నారు. గత ప్రభుత్వ అప్పులకు అసలు, వడ్డీ కలిపి ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్లకు పైగా చెల్లించామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 3.5 కోట్ల మందికి ప్రతి నెలా సన్న బియ్యం అందిస్తున్నామని, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొడంగల్‌లో పారిశ్రామిక, విద్యా, సాగునీటి రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఏడాదిలోపు రాష్ట్రవ్యాప్తంగా 14 పామాయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని, హకీంపేటలోని కర్మాగారాన్ని ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు లగచర్ల పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!