

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నిర్వహించిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీ (PRP)గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లోనూ ఉండకూడదని, సమాజంలో మార్పు ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని అన్నారు. మంచి పనులు ఎవరు చేసినా అభినందించాలని, తప్పులు చేసిన వారిని ఆధారాలతో ప్రశ్నించాలని సూచించారు. ప్రశ్నించడం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను రెండు కుటుంబాలే పాలించాలా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుమారుడే మళ్లీ ముఖ్యమంత్రి కావాలా, సాధారణ ప్రజలు, ప్రతిభావంతులైన యువత నుంచి కొత్త నాయకులు ఎదగకూడదా అని నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో తాను కూడా భాగస్వామినని, ఇటుక ఇటుక పేర్చి పార్టీని నిర్మించేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డానని గుర్తుచేసుకున్నారు. ఆ కష్టంతోనే తాను ఎంపీగా ఎదిగానని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం, ప్రశ్నించే హక్కు, కొత్త నాయకత్వానికి అవకాశాలు వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ కొత్త రాజకీయ పార్టీతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!