

తనను, పార్టీ నేతలను రహస్య కార్యాచరణ ద్వారా ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని డీకే శివకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తనను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని, అందుకే మంత్రులు, పార్టీ నేతలను అప్రమత్తం చేశానని ఆయన తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు దిల్లీ వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, ఇందుకోసం ఏజెంట్లను నియమించడంతో పాటు ఆర్థిక సహకారం అందించినట్లు గుర్తించానని పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక కన్నడిగులు ఉన్నారా, బయటి వ్యక్తులు ఉన్నారా అనే విషయాన్ని ఇప్పుడే వెల్లడించాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని ఉద్దేశించినట్లుగా భావించే వ్యాఖ్యలు చేస్తూ, కొందరు తమకు తామే స్పందిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు.
సమర్థమైన పాలకులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు ఎంతో కీలకమని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన ఓటరు హక్కును కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాట్లు జరుగుతున్నాయని కేంద్రం పదేపదే చెబుతోందని, అయితే ఇలాంటి పరిణామాలకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థను తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలోని లోపాలను సరిచేయాలని కోరుతూ నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని తెలిపారు. కర్ణాటకలో తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత పార్టీ తరఫున తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయిస్తామన్నారు. మరణించిన వ్యక్తులు, అర్హత లేని ఓటర్ల పేర్ల తొలగింపుపై అభ్యంతరం లేదని, నిజమైన ఓటర్ల హక్కులు పరిరక్షించడమే ప్రధానమని పేర్కొన్నారు. ఓటు హక్కుల రక్షణ కోసం ఇండియా కూటమి నేతలు చేస్తున్న పోరాటాన్ని అభినందించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!