

పురపాలక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ అభ్యర్థుల్లో అసంతృప్తి బయటపడుతోంది. కొందరు తమ ఓటమికి పార్టీ నేతల తీరే కారణమంటూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన చింతపల్లి నాగేశ్వరరావు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడు, రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి సూర్యప్రకాశరావు తన ఓటమికి కారణమని ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా ఒత్తిడి చేసి ఎన్నికల బరిలో నిలిపారని, ప్రచారానికి వారు రాలేదని, సహాయం కోరితే దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఆర్థికంగానూ ఎలాంటి సహకారం అందలేదని, వారిని నమ్మి దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసుకున్నానని వాపోయారు. తానే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్నానని కన్నీటిపర్యంతమయ్యారు.
పార్టీ నేతలను నమ్మి మోసపోవద్దని హెచ్చరిక
ప్రస్తుతం పోటీలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవాలని నాగేశ్వరరావు సూచించారు. పార్టీ నేతలను నమ్మి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, చివరకు మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపని కొందరు నేతలు కూడా పార్టీ అధినేత జగన్ ఒత్తిడితో బరిలోకి దిగినట్లు కథనంలో పేర్కొన్నారు. అయితే, వారికి పార్టీ నుంచి ఆర్థికంగా, ప్రచార పరంగా తగిన సహకారం అందలేదని, కొందరు అభ్యర్థుల తరఫున నేతలు ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారని సమాచారం. అమలాపురంలో ఇలాంటి కొందరు అభ్యర్థులకు 50 ఓట్లలోపే వచ్చాయి. రామచంద్రపురంలో కూటమి తరఫున మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా విజయం సాధించిన శేషారావు గతంలో వైకాపాలో ఉన్నారు. తన భార్యకు ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి అప్పటి నాయకులు మోసం చేయడంతో ఆయన తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!