

విడుదల తేదీ: నవంబర్ 20, 2026
నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల తదితరులు
దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి
నిర్మాతలు: శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్‌మాగ్
సంగీత దర్శకుడు: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: ఎళిల్ అరసు కె
ఎడిటర్: ఆర్. కళైవణన్
చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించే నిత్యారెడ్డి (సాయి పల్లవి).. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడిపించే కార్తికేయన్ అలియాస్ సియా (మమ్ముట్టి)ని పట్టుకునేందుకు ఓ ప్రణాళిక రచిస్తుంది. ఇందులో భాగంగా పోలీసు అధికారి పళని (ధనుష్)ను సియా గ్యాంగ్‌లోకి రహస్యంగా పంపించి, వారి కార్యకలాపాల గురించి సమాచారం సేకరించే బాధ్యత అప్పగిస్తుంది. ఈ మిషన్‌లో పళని ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలే సినిమా ప్రధాన కథాంశం.
ఫస్టాఫ్‌లో కథనం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెట్టడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ప్రధాన పాత్రలు, వాటి నేపథ్యం, లక్ష్యాలను పరిచయం చేసేందుకు రాజ్‌కుమార్ పెరియసామి ఎక్కువ సమయం తీసుకున్నా.. కథనంలో ఉన్న వివరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తాయి. స్క్రీన్‌ప్లే విధానం కొన్ని సందర్భాల్లో ‘ధురంధర్’ను గుర్తు చేసినా.. అది సినిమాకు పెద్దగా ఇబ్బందిగా మారదు. ముఖ్యంగా ధనుష్ పరిచయ సన్నివేశం దాదాపు పది నిమిషాల పాటు సింగిల్ షాట్‌లో సాగడం ఆకట్టుకుంటుంది. నటీనటుల ప్రతిభతో పాటు సినిమాటోగ్రఫీ పనితనం ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది.
అండర్‌కవర్ పోలీస్ అధికారిగా ధనుష్ అద్భుతంగా నటించాడు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, వ్యక్తిగత జీవితంలో తలెత్తే ఇబ్బందులను తన నటనతో చక్కగా పలికించాడు. పరిమిత స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ శ్రీలీల తన పాత్రతో ఆకట్టుకుంది. కథానాయకుడిని అనుమానించే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు, ధైర్యమైన పోలీస్ అధికారిణిగా సాయి పల్లవి మెప్పించింది. చైతూ జొన్నలగడ్డ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.
ఆసక్తికరమైన మలుపుతో ఫస్టాఫ్ ముగిసినప్పటికీ.. సెకండాఫ్‌లో అదే ఉత్కంఠ కొనసాగదు. కథ ముందుకు సాగకుండా కొన్ని సన్నివేశాల్లో నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. ధనుష్ గత చిత్రాల్లో చూసిన భావోద్వేగ అంశాలే ఇందులోనూ కనిపించడం కొంత నిరాశ కలిగిస్తుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులపై ఆశించిన ప్రభావం చూపదు. సెకండాఫ్‌లో వచ్చే ‘వీరా’ పాట, ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్ మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తాయి. మిగతా సన్నివేశాలు చాలావరకు ఊహించదగినవిగా, ఆసక్తి కలిగించనివిగా సాగుతాయి. కథనాన్ని అనవసరంగా సాగదీయడం వల్ల చివరికి సినిమా నిడివి ఎక్కువైన భావన కలుగుతుంది. జైలు ఫైట్ సీక్వెన్స్ కూడా సరిగా తెరకెక్కించలేదు.
మమ్ముట్టి పాత్రకు ఆశించిన స్థాయిలో బలం, తీవ్రత లేకపోవడం మరో ప్రధాన లోపం. ప్రతినాయకుడిగా ఆయన పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల్లో భయాన్ని కలిగించేలా తీర్చిదిద్దలేకపోయారు. పాత్రకు మరింత లోతు, బలమైన రైటింగ్ ఉంటే సినిమా స్థాయి పెరిగేది. మరోవైపు, సాయి పల్లవి పాత్ర పెద్దగా ఉత్కంఠకు తావులేకుండానే నేరస్థులను పట్టుకోవడం థ్రిల్‌ను తగ్గిస్తుంది. ట్రైలర్‌లోనే సినిమాలోని కీలక అంశాలు చాలావరకు వెల్లడవడంతో కొత్తగా ఆశ్చర్యపరిచే అంశాలు తక్కువగా ఉంటాయి. రేణు దేశాయ్ పాత్ర కూడా కథ ముందుకు సాగేకొద్దీ ప్రాధాన్యం కోల్పోతుంది.
సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా ‘వీరా’ పాట తెరపై అద్భుతంగా అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల పాటలోని సాహిత్యం స్పష్టంగా వినిపించకపోవడం సౌండ్ మిక్సింగ్‌లో లోపాన్ని సూచిస్తుంది. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ధనుష్ సింగిల్ షాట్ పరిచయ సన్నివేశం, ఫారెస్ట్ ఫైట్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. అనవసరంగా సాగిన సన్నివేశాల వల్ల సినిమా నిడివి ఎక్కువైనట్లు అనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే.. ధనుష్ నటించిన ‘ఓఎం’ భారీ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి సఫలమైనా.. సెకండాఫ్‌లో ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలు పండలేదు. ధనుష్ నటన, కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సినిమా అక్కడక్కడా మాత్రమే మెప్పిస్తుంది. మొత్తానికి ఇది ఓ మోస్తరు చిత్రంగా మిగిలిపోతుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!