

నటీనటులు: మౌళి తనుజ్ ప్రశాంత్, సుష్మితా శెట్టి, అలీ, రఘుబాబు తదితరులు
దర్శకుడు: శ్రీను కంబాల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
సంగీత దర్శకుడు: సింజిత్ యర్రమిల్లి
సినిమాటోగ్రాఫర్: సూర్య బాలాజీ
ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి
గతంలో దొంగ నా కొడుకు అనే టైటిల్‌తో ప్రచారంలోకి వచ్చిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల DNKగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మౌళి తనుజ్ ప్రశాంత్ కథానాయకుడిగా నటించాడు. విశాఖపట్నానికి చెందిన ఈశ్వర్ (మౌళి) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటాడు. అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చేందుకు ఓ ప్రణాళిక వేస్తాడు. అయితే ఆ ప్రయత్నం అతడితో పాటు కుటుంబాన్ని కూడా ఊహించని సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఈ పరిస్థితుల నుంచి ఈశ్వర్ ఎలా బయటపడ్డాడు? అతడి ప్రణాళిక చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనేదే సినిమా కథ.
మౌళి తన పాత్రకు చక్కగా సరిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో పలు సన్నివేశాల్లో నవ్వులు పంచాడు. ముఖ్యంగా సీరియస్, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశాడు. మౌళికి సహాయకుడిగా నటించిన బబ్లూ కూడా కొన్ని చోట్ల నవ్వించాడు. అలీ, రజిత తమ పాత్రల పరిధి మేరకు నటించారు. గుండు సుదర్శన్ తన నటనతో ఆకట్టుకోగా.. నంద గోపాల్ కథకు అవసరమైన గంభీరతను తీసుకొచ్చాడు. భద్రం నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కామెడీ, ఉత్కంఠ, అనూహ్య మలుపులు కొంతవరకు ప్రేక్షకులను అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా కీలక సన్నివేశాలకు బలాన్నిచ్చింది.
ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం ఆశించిన స్థాయిలో లేదు. మౌళి ప్రధాన పాత్రలో ఉండటంతో దర్శకుడు క్రైమ్ డ్రామా కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను ఆశించే ప్రేక్షకులకు సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ప్రథమార్ధం సాధారణంగా సాగుతూ పరిమిత వినోదాన్నే అందిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించదు. కథానాయిక సుష్మితా శెట్టి తెరపై అందంగా కనిపించినప్పటికీ.. ఆమె పాత్రకు తగినంత ప్రాధాన్యత, స్క్రీన్ స్పేస్ లభించలేదు. ప్రియా, రఘుబాబు కాంబినేషన్‌లో మరింత కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు.
తొలి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీను కంబాల ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. కథనం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. సహజమైన హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే సినిమా ఫలితం మెరుగ్గా ఉండేది. ఎడిటర్ శ్రీధర్ సోంపల్లి కొన్ని అనవసర సన్నివేశాలను తొలగించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సింజిత్ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు కొంత బలాన్ని చేకూర్చింది.
మొత్తంగా DNK (దొంగ నా కొడుకు) ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని క్రైమ్ కామెడీ డ్రామా. మౌళి తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేయగా.. బబ్లూ కూడా కొన్ని సన్నివేశాల్లో అలరిస్తాడు. అయితే బలహీనమైన కథనం, బలవంతంగా ఇరికించిన కామెడీ, నెమ్మదైన కథనం, అంతగా ఆకట్టుకోని పాత్రలు సినిమాకు ప్రతికూలంగా మారాయి. ద్వితీయార్ధంలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సినిమా మొత్తంగా ఒకే స్థాయిలో సాగదు. బలమైన ముద్ర వేయడంలో విఫలమైన ఈ సినిమాను థియేటర్లలో చూడటం కంటే ఇతర మంచి చిత్రాలను ఎంచుకోవడం ఉత్తమం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!