

బిగ్‌బాస్ తెలుగు 10లో రెండో వారం సందడి మొదలైంది. వారాంతపు ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో ఆటలు ఆడిస్తూనే వారి ప్రవర్తనపై తనదైన శైలిలో సూచనలు చేశారు. ముఖ్యంగా రోహిత్, శాలినీ, సృష్టి తెలుగులో మాట్లాడగలిగినా ఎక్కువగా ఆంగ్లంలో మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు దేబ్జానీ తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నించడాన్ని నాగార్జున అభినందించారు.
ఎపిసోడ్‌లో పవర్ గేమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లు సృష్టికి రావడంతో ఆమె వద్ద ఉన్న పవర్‌ను నాగార్జున తీసుకున్నారు. అనంతరం పవర్ దక్కని సుధీర్, రోహిత్, అమన్, దేబ్జానీలకు పోటీ నిర్వహించగా.. సుధీర్ విజయం సాధించి సృష్టి పవర్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సృష్టిని హౌస్‌మేట్‌గా ప్రకటించగా, నరేష్ కూడా హౌస్‌మేట్ అయ్యారు. డైలాగ్ గుర్తుపట్టే టాస్క్‌లో కృష్ణుడి టీమ్ విజయం సాధించింది. గెలిచిన టీమ్‌కు వచ్చిన స్వీట్లను కృష్ణుడు తాను తినడం మానేశానని చెప్పి ప్రత్యర్థి టీమ్‌కు ఇచ్చాడు.
ఎపిసోడ్ చివర్లో రోహిత్, వంశీ స్విమ్మింగ్ పూల్‌లోని ట్రెజర్ బాక్స్‌ను తీసుకురాగా.. అందులో ఝాన్సీ పేరు ఉండటంతో ఆమెకు హౌస్‌మేట్ అయ్యే అవకాశం దక్కింది. అనంతరం వర్షిణి, సుధీర్, కృష్ణుడిని ఎలిమినేషన్ కోసం పిలిచినట్లు భావించినా.. ముగ్గురినీ హౌస్‌మేట్స్‌గా ప్రకటించి నాగార్జున సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ లేకుండా పోయింది. తొలి వారం ‘మహాపరిక్ష’గా సాగిందని ప్రకటించిన నాగార్జున.. రెండో వారం ‘పవర్ ఆఫ్ పీపుల్’గా ఉంటుందని, ఆటకు సంబంధించిన నిర్ణయాల్లో ప్రేక్షకులకూ అవకాశం ఉంటుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!