

బిగ్‌బాస్ తెలుగు 10లో వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల ఆటతీరును సమీక్షించారు. ఈ వారం హౌస్‌లో చోటుచేసుకున్న గొడవలు, వ్యక్తిగత విమర్శలు, మాటల యుద్ధాలపై స్పందిస్తూ పలువురు కంటెస్టెంట్లకు సూచనలు చేశారు. అక్టోబర్ 24న ప్రసారమైన 49వ ఎపిసోడ్‌లో నరేష్ ఆటతీరును నాగార్జున ప్రశంసించారు. ఆటతో పాటు ప్రవర్తనలోనూ మంచి సమతుల్యత చూపిస్తూ హౌస్‌లో వినోదాన్ని పంచుతున్నాడని అభినందించారు. హౌస్‌లో జరిగే గొడవలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని సూచిస్తూ, కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు ప్రత్యేక యాక్సెస్ కల్పించారు. అమన్ ఆటలో మెరుగుదల కనిపిస్తోందని ప్రశంసించిన నాగార్జున, ఇతరులు నిరుత్సాహపరిచినా లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. కష్టమైన టాస్క్‌లో పట్టుదలతో చివరి వరకు ప్రయత్నించిన దేబ్జానీని కూడా అభినందించారు.
మరోవైపు, శివ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన ముకేష్ తీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతూ డాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతూ, మాటలను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఇక శివ ఆటతీరును ప్రశంసించిన నాగార్జున, తనను తాను నిరూపించుకునేందుకు అతను చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. తనకు తెలిసిన వ్యక్తే తన గురించి అలా మాట్లాడటంతో బాధపడ్డానని శివ చెప్పగా, భావోద్వేగాలను పక్కనపెట్టి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షిణి ఆటతీరుపైనా నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతూతో పోల్చుకుని తన ప్రదర్శనను విశ్లేషించుకోవాలని, గతంలో చేసిన వ్యాఖ్యలకు మాటలతో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలని సూచించారు. తనలో ఉన్న పోరాటపటిమను ఆటలో పూర్తిస్థాయిలో చూపించాలని వర్షిణికి స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!