

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా జరిగే ఎలిమినేషన్‌కు భిన్నంగా, ఈసారి హౌస్‌లోని కంటెస్టెంట్ల నిర్ణయం మేరకు రోహిత్‌ను బయటకు పంపించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్ మండ స్పందిస్తూ, షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించే వరకు రోహిత్ ఎలిమినేషన్‌ను ధృవీకరించలేమని పేర్కొన్నాడు. రోహిత్‌కు సీక్రెట్ రూమ్ అవకాశం ఇచ్చి ఉండొచ్చని కూడా అభిప్రాయపడ్డాడు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందే కంటెస్టెంట్లు షో నిబంధనలు, షరతులకు అంగీకరించి ఒప్పందాలపై సంతకాలు చేస్తారని కౌశల్ గుర్తుచేశాడు. మధ్యలో ఇష్టం వచ్చినట్లు షో నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉండదని, ఒప్పందాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపాడు. రోహిత్ వంటి బలమైన కంటెస్టెంట్‌ను నిర్వాహకులు అంత సులభంగా ఎలిమినేట్ చేయరని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మరోవైపు, ఆత్మగౌరవం కంటే ఏ రియాల్టీ షో పెద్దది కాదని చెబుతూ రోహిత్ సీక్రెట్ రూమ్ ఆఫర్‌ను తిరస్కరించాడంటూ అతని పీఆర్ బృందం నుంచి పోస్టులు వచ్చినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందనేది ఆదివారం ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే స్పష్టత రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!