

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్‌లో ఆటగాడిగా కొనసాగకూడదని తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో ధోనీ కీలక పాత్ర పోషించారు. మరో సీజన్‌లోనూ మైదానంలో ధోనీ ఆటను చూడవచ్చని అభిమానులు ఆశించిన తరుణంలో ఆయన ఆటగాడిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై సీఎస్కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ తాజాగా స్పందించారు. 2027 ఐపీఎల్ సీజన్ ప్రస్తుత సైకిల్‌లో చివరిది అయినప్పటికీ, ధోనీ ఆటకు వీడ్కోలు పలుకుతారని తాను అస్సలు ఊహించలేదని తెలిపారు. సీఎస్కే యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ధోనీకి బాగా తెలుసని, ఎలాంటి హంగామా లేకుండా చాలా సహజంగా తన నిర్ణయాన్ని వెల్లడించారని జహీర్ పేర్కొన్నారు.
ధోనీ ఇకపై క్రికెటర్‌గా కాకుండా మెంటర్‌గా జట్టుతో ఉండనుండటంపై తనకు మిశ్రమ భావోద్వేగాలు ఉన్నాయని జహీర్ ఖాన్ తెలిపారు. ఒకవైపు మెంటర్‌గా తన బాధ్యతలను పంచుకుంటూ జట్టుకు సరైన దిశానిర్దేశం చేస్తారనే ఆనందం ఉందని, మరోవైపు మైదానంలో ఆటగాడిగా ధోనీని చూడలేమనే భావన బాధ కలిగిస్తోందని చెప్పారు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం ధోనీ నాయకత్వంలోని గొప్ప లక్షణమని ప్రశంసించారు. సీఎస్కే బాధ్యతలను పంచుకునే విషయంలో తమ మధ్య ఎలాంటి హద్దులు లేవని వెల్లడించారు. ఇదిలా ఉంటే, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగనున్న చెన్నై సూపర్ కింగ్స్ రూ.28.05 కోట్ల పర్స్‌తో రాబోయే వేలానికి సిద్ధమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!