

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ స్పందించారు. సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదని స్పష్టం చేశారు. కేవలం తొలి రోజు ఆటను మాత్రమే కాకుండా ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని వివరించారు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లతో కూడిన పేస్ దళాన్ని బరిలోకి దించడానికి గల కారణాలను వెల్లడించారు. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌లో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశామని తెలిపారు. ఈ మ్యాచ్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్ అని జట్టు మేనేజ్‌మెంట్ భావించినట్లు చెప్పారు.
మరోవైపు తొలి రోజు న్యూజిలాండ్ 243/5 స్కోరు చేయడంపై భారత బౌలర్ల ప్రదర్శన గురించి కూడా కొటక్ స్పందించారు. హెన్రీ నికోల్స్ 113 పరుగులతో, గ్లెన్ ఫిలిప్స్ 94 పరుగులతో అజేయంగా నిలిచి కివీస్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపారు. 30వ ఓవర్ తర్వాత కుకబుర్రా బంతి మెరుపు తగ్గడంతో బౌలర్లకు సహకారం తగ్గిందని కోచ్ వివరించారు. గంటకు 126–130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న అన్షుల్ కాంబోజ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడో స్పెల్‌లో వేగం కీలకమవుతుందని చెప్పారు. ప్రసిద్ధ్ కృష్ణ అటాకింగ్ బౌలర్ అని, వికెట్ల కోసం ప్రయత్నించే క్రమంలో పరుగులు సమర్పించుకోవడం సహజమని సమర్థించారు. వికెట్లు తీసినప్పుడు ప్రశంసించి, పరుగులు ఇచ్చినప్పుడు విమర్శించడం సరికాదన్నారు. ఎండ తీవ్రత కారణంగా పిచ్‌పై తేమ త్వరగా ఆరిపోయిందని, కొత్త బంతితోనే బౌలర్లకు ఎక్కువ సహకారం లభించిందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!