

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిభావంతులైన యువ ప్రముఖులతో రూపొందించిన ‘టైమ్ 100 నెక్స్ట్ – భారత్’ జాబితాలో అతడికి చోటు దక్కింది. ఈ జాబితాలో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, చెస్ ఛాంపియన్ డి. గుకేశ్, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా వైభవ్‌ను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా ఓ పోస్టు పెట్టాడు.
వైభవ్ కేవలం అద్భుతమైన క్రీడాకారుడే కాదని, మారుతున్న భారతానికి ప్రతిరూపమని ఆయుష్మాన్ తన పోస్టులో పేర్కొన్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో రికార్డులు సృష్టించి, ఆ తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగడం అతడి ప్రతిభకు నిదర్శనమని కొనియాడాడు. ప్రతిభ ఎక్కడి నుంచైనా రావచ్చని వైభవ్ ప్రయాణం నిరూపిస్తోందని, అతడి విజయాన్ని కేవలం పరుగులతో కొలవలేమని అభిప్రాయపడ్డాడు. యువతకు తమ కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛ, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధించగలరని అతడి ప్రస్థానం చాటుతోందని పేర్కొన్నాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!