

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతీరు, నాయకత్వ లక్షణాలు, ప్రశాంతమైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని ధోని తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆయన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత నిర్ణయమని, ఆటలో ఎప్పుడూ వందశాతం కృషి చేసే ఆటగాడని పేర్కొన్నారు. తనవంతు పూర్తి స్థాయిలో ఇవ్వలేనని భావిస్తే స్వయంగా తప్పుకునే వ్యక్తిత్వం ఆయనదని చెప్పారు. భారత క్రికెట్‌కు ధోని అందించిన సేవలు ఎంతో విలువైనవని, ఆటగాడిగా దూరమైనా సీఎస్కేకు మెంటార్‌గా తన సేవలను కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. తమిళనాడు అభిమానులు ఆయనను ‘తలా’ అని పిలుచుకుంటారని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ధోనికి అభిమానులు ఉన్నారని గుర్తుచేశారు.
2007లో భారత జట్టు కెప్టెన్‌గా ధోని ఎంపికైనప్పుడు కొందరిలో అనుమానాలు ఉన్నాయని, అయితే తన ఆటతీరుతో వాటన్నింటినీ పటాపంచలు చేసి అత్యంత విజయవంతమైన సారథిగా ఎదిగాడని రాజీవ్ శుక్లా తెలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ జట్టుకు విజయాలు అందించడం ఆయన ప్రత్యేకతగా నిలిచిందన్నారు. 2006లో భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో జరిగిన మరో ఆసక్తికర సంఘటనను కూడా గుర్తుచేశారు. అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్.. ధోని బ్యాటింగ్‌తో పాటు ఆయన హెయిర్‌స్టైల్‌కు ముగ్ధుడయ్యారని, ఆ హెయిర్‌స్టైల్‌ను మార్చుకోవద్దని సూచించారని తెలిపారు. ఈ ఘటన తర్వాత ధోని మరింత ప్రజాదరణ పొందాడని పేర్కొన్న శుక్లా.. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సానుకూల దృక్పథంతో స్వీకరించాలని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!