

భారత ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2026–27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,235 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం ఈసారి 21 శాతం పెరిగి రూ.5,132 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.31,942 కోట్ల నుంచి రూ.35,620 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 11 శాతం, ఆదాయం 3 శాతం పెరిగాయి. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ, అక్టోబర్ 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. బలమైన డీల్స్, ఏఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాలను 2.5–4 శాతానికి పెంచింది. ఐటీ సేవల ఆదాయం రూ.26,938 కోట్లకు చేరగా, ఇంజినీరింగ్, పరిశోధన–అభివృద్ధి సేవల ఆదాయం రూ.5,973 కోట్లకు పెరిగింది. హెచ్‌సీఎల్ సాఫ్ట్‌వేర్ ఆదాయం మాత్రం రూ.2,709 కోట్లకు తగ్గింది.
కంపెనీ నిర్వహణ పనితీరులోనూ మెరుగుదల కనిపించింది. ఈబీఐటీ మార్జిన్లు 16.9 శాతం నుంచి 18.2 శాతానికి పెరిగాయి. ఆర్డర్ల బుకింగ్స్ 27 శాతం వృద్ధితో 3.3 బిలియన్ డాలర్లకు చేరగా, ఏఐ ద్వారా వచ్చిన ఆదాయం 78 శాతం పెరిగి 219 మిలియన్ డాలర్లకు చేరింది. ఉద్యోగుల సంఖ్య 6,450 పెరిగి 2,30,339కు చేరుకోగా, ఉద్యోగుల వలసల రేటు 12.8 శాతంగా నమోదైంది. మరోవైపు, ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌తో హెచ్‌సీఎల్ టెక్ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆంత్రోపిక్ క్లాడ్ సాంకేతికత ఆధారంగా ఎంటర్‌ప్రైజ్ సంస్థలకు ఎజెంటిక్ ఏఐ పరిష్కారాలను అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లోనూ ఏఐ మోడళ్లను అనుసంధానించనుంది. ఈ పరిష్కారాల ద్వారా సంస్థలు భద్రత, సైబర్ సెక్యూరిటీ, గవర్నెన్స్‌ను మెరుగుపరుచుకుంటూ మానవ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!