

అంతరిక్షంలోనే డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా అమెరికా కీలక ముందడుగు వేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన SpaceX సంస్థ ‘స్టార్‌మైండ్’ ప్రాజెక్టు కింద 10 లక్షల వరకు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) అనుమతి మంజూరు చేసింది. ఈ ఉపగ్రహాలు కక్ష్యలోనే డేటా సెంటర్లుగా పనిచేస్తూ, కృత్రిమ మేధ (AI) అవసరాలకు భారీ మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయనున్నాయి. వీటికి ప్రధానంగా సౌరశక్తి ద్వారా విద్యుత్తు అందించడంతో పాటు, ఉపగ్రహాల మధ్య సమాచార మార్పిడికి ఆప్టికల్ లింక్‌లను ఉపయోగించనున్నారు.
భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్తు, మౌలిక సదుపాయాల ఖర్చులను అంతరిక్ష డేటా సెంటర్ల ద్వారా తగ్గించవచ్చని SpaceX భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించడంపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇది భవిష్యత్తులో అమెరికాతో పాటు ప్రపంచానికి గొప్ప ఆస్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. FCC అనుమతి ప్రకారం, SpaceX తొలి ఆపరేషనల్ ఉపగ్రహాన్ని 2033 నవంబర్ నాటికి కక్ష్యలోకి పంపాలి. 2035 నవంబర్ నాటికి మొత్తం అనుమతించిన ఉపగ్రహాల్లో 10 శాతం, 2038 నవంబర్ నాటికి 50 శాతం ప్రయోగించాలి. అయితే, తొలి ప్రయోగాలను 2027లోనే ప్రారంభించాలని SpaceX భావిస్తున్నట్లు సమాచారం. ఈ అనుమతి లభించినంత మాత్రాన మొత్తం ఉపగ్రహ వ్యవస్థ ఇప్పటికే సిద్ధమైందని లేదా అంతరిక్షంలోకి చేరిందని అర్థం కాదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!