

సెమీకండక్టర్ తయారీ దిగ్గజం ఇంటెల్ మరోసారి ఉద్యోగ కోతలు చేపట్టింది. తాజా తొలగింపుల ప్రభావం గ్లోబల్ ఐటీ విభాగంలోని ఉద్యోగులపై పడినట్లు సమాచారం. సీఈవో లిప్ బూ టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విడతలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఏయే టీమ్‌లపై ప్రభావం పడిందనే వివరాలను ఇంటెల్ వెల్లడించలేదు. సంస్థను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు, వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య, వనరులను సమీక్షిస్తున్నామని ఇంటెల్ ప్రతినిధి తెలిపారు. గత కొంతకాలంగా టెక్ రంగంలో వరుసగా ఉద్యోగ కోతలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది.
ఖర్చులను తగ్గించడం, సంస్థ నిర్మాణాన్ని సరళీకరించడం, కీలక వ్యాపార విభాగాలపై దృష్టి పెట్టడం వంటి లక్ష్యాలతో ఇంటెల్ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతోంది. ఏఐ చిప్‌ల మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ, తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం కూడా సంస్థకు సవాళ్లుగా మారాయి. ఇంటెల్ అధికారిక ఆర్థిక నివేదిక ప్రకారం, 2026 సెప్టెంబర్ చివరి నాటికి సంస్థలో 81,100 మంది ఉద్యోగులు ఉండగా, 2025 చివరి నాటికి ఈ సంఖ్య 85,100గా ఉంది. అంటే ఆ కాలంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,000 తగ్గింది. అయితే ఈ తగ్గుదలలో తాజా లేఆఫ్స్ వాటా ఎంతనేది స్పష్టంగా తెలియదు. ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన పరిహార ఖర్చులను కూడా సంస్థ తన పునర్వ్యవస్థీకరణ నివేదికల్లో పేర్కొంది. భవిష్యత్తులో వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఖర్చులు, ప్రాజెక్టులు, ఉద్యోగుల కేటాయింపులను సమీక్షించే చర్యలను ఇంటెల్ కొనసాగిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!