

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ప్రోగ్రామింగ్ భాషల్లో ఒకటైన జావాలో తీవ్రమైన భద్రతా లోపాన్ని ఓ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ గుర్తించినట్లు వెల్లడించింది. కాలిఫ్ అనే సంస్థ ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-6 ఏఐ మోడల్ సాయంతో జావా మెమొరీ సిస్టమ్‌లోని ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. దీనికి ‘జావా4షెల్’ (Java4Shell) అని పేరు పెట్టింది. ఈ లోపాన్ని హ్యాకర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుని ప్రభావితమైన కంప్యూటర్ సిస్టమ్‌లలో అవాంఛిత ప్రోగ్రామ్‌లను రన్ చేసే ప్రమాదం ఉందని సంస్థ హెచ్చరించింది. 1995లో విడుదలైన జావా ప్రోగ్రామింగ్ భాష ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని కాలిఫ్ అభిప్రాయపడింది. ఇదే సంస్థ గతంలో మరో ప్రముఖ ప్రోగ్రామింగ్ భాష పీహెచ్‌పీలోనూ తీవ్రమైన లోపాన్ని గుర్తించి టెక్నాలజీ ప్రపంచాన్ని అప్రమత్తం చేసినట్లు పేర్కొంది.
జావాను ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ సంస్థలు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ భద్రతా లోపం ఆందోళన కలిగిస్తోంది. ఫార్చ్యూన్-500 జాబితాలోని సుమారు 90 శాతం కంపెనీలు తమ వెబ్‌సైట్లు, అప్లికేషన్ల కోసం జావాను ఉపయోగిస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు. యాపిల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ భాషపై ఆధారపడుతున్నాయి. మరోవైపు, జావా బాధ్యతలు నిర్వహిస్తున్న ఒరాకిల్ సంస్థ ఈ లోపంపై నేరుగా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కీలకమైన ప్యాచ్ అప్‌డేట్‌ను విడుదల చేసినట్లు సమాచారం. ఈ లోపాన్ని ఉపయోగించి ఇప్పటికే ఏవైనా సైబర్ దాడులు జరిగాయా అనే విషయంపై స్పష్టత లేదు. ఇదిలా ఉండగా, అమెరికాలో మంగళవారం పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. యాపిల్, గూగుల్ సాఫ్ట్‌వేర్ సేవలతో పాటు అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థల్లోనూ అంతరాయాలు ఎదురైనట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!