

కొత్త మారుతి బ్రెజ్జాకు భారత మార్కెట్లో భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్స్ 95 వేల యూనిట్లను దాటాయి. త్వరలోనే బుకింగ్స్ సంఖ్య లక్షకు చేరుతుందని మారుతి సుజుకి అంచనా వేస్తోంది. జూలై చివర్లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీ ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.7.39 లక్షల నుంచి రూ.13.55 లక్షల వరకు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 15 వేలకు పైగా బ్రెజ్జా యూనిట్లు విక్రయించినప్పటికీ, సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది.
వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించి పెరుగుతున్న ఆర్డర్లను వేగంగా పూర్తి చేసేందుకు మారుతి సుజుకి హర్యానాలోని ఖర్ఖోడా ప్లాంట్‌లో బ్రెజ్జా ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో బ్రెజ్జాతో పాటు విక్టోరిస్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రెండో ఉత్పత్తి యూనిట్ అందుబాటులోకి రావడంతో ఖర్ఖోడా ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5 లక్షల వాహనాలకు చేరింది. ఉత్పత్తి పెంపుతో కస్టమర్లకు వాహనాల డెలివరీ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!