

ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు, సాంకేతిక అంతరాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సూపర్ మార్కెట్లలో ఫ్రిజ్‌లు హ్యాకింగ్‌కు గురవడం, బాంబు బెదిరింపులతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటం, సాంకేతిక సమస్యలతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడం, ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు స్తంభించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఐరోపా, అమెరికా సహా పలు దేశాల్లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే వీటి వెనుక ఎవరున్నారనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. ఏ సంస్థ లేదా హ్యాకింగ్ బృందం బాధ్యత ప్రకటించకపోవడంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంభవించే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కీలక మౌలిక సదుపాయాల్లో అంతరాయాలు ఏర్పడి విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌లు, నీటి సరఫరా, వైద్య సేవలు, ప్రజా రవాణా వంటి అత్యవసర వ్యవస్థలు నిలిచిపోవడాన్ని ‘బ్లాక్ స్కై’ సంక్షోభంగా పేర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ మార్కెట్లలో శీతలీకరణ వ్యవస్థలు, ఇళ్లలో ఉష్ణోగ్రత నియంత్రణ సదుపాయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ప్రభుత్వం ‘బీ రెడీ’ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు అధికారిక సమాచారాన్ని తెలుసుకునేందుకు బ్యాటరీతో పనిచేసే రేడియోలు, పవర్ బ్యాంకులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. మరోవైపు, అమెరికా జాతీయ భద్రత సంస్థ (NSA) రహస్య సమాచార మార్పిడి కోసం ఉపయోగించే ‘NSANet’ నెట్‌వర్క్ ఇటీవల సాంకేతిక అంతరాయానికి గురైనట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది సైబర్ దాడి వల్లే జరిగిందని నిర్ధారించే ఆధారాలు లేవని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, కృత్రిమ మేధ (AI) సాయంతో హ్యాకర్లు సైబర్ దాడులను మరింత విస్తృతం చేస్తున్నారని గూగుల్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను గుర్తించడంతో పాటు దాడులను ఆటోమేటిక్‌గా నిర్వహిస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లలో వచ్చిన మార్పులను ఏఐ వ్యవస్థలు విశ్లేషించి, భద్రతా అప్‌డేట్లు అమలు చేయని సంస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!