

భారతీ ఎయిర్‌టెల్ ఫిన్‌టెక్ విభాగమైన ఎయిర్‌టెల్ మనీ అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించిన షేర్ ధర శ్రేణి, ఇష్యూ పరిమాణం, ఇతర వివరాలను అక్టోబర్‌లో సమర్పించే ముసాయిదా పత్రాల్లో వెల్లడించనున్నట్లు ఎల్‌ఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అక్టోబర్ మూడో వారంలో ఐపీఓ తుది ధరను ఖరారు చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఐపీఓలో ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు.
ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎయిర్‌టెల్ మనీతో ముందస్తు పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుంది. తుది ఆఫర్ ధర వద్ద ప్రస్తుత వాటాదారుల నుంచి సుమారు 90 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను, అంటే దాదాపు రూ.750 కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేసేందుకు ఐఎఫ్‌సీ అంగీకరించింది. ఎయిర్‌టెల్ మనీ సీఈవో ఇయాన్ ఫెర్రావో ప్రకారం, ప్రతి నెలా సుమారు 5.3 కోట్ల మంది డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఆఫ్రికాకు ఎయిర్‌టెల్ మనీలో 77.85 శాతం వాటా ఉంది. లిస్టింగ్ తర్వాత కూడా ఎయిర్‌టెల్ ఆఫ్రికా ప్రధాన వ్యూహాత్మక వాటాదారుగా కొనసాగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!