

భారతదేశంలో వ్యక్తిగత, ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బంగారు ఆభరణాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. ఈ రుణానికి బంగారం భద్రతగా ఉండటంతో, సాధారణంగా పర్సనల్ లోన్లతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. గోల్డ్ లోన్ల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు రుణగ్రహీతల హక్కులను కాపాడేందుకు ఆర్బీఐ 2025 జూన్ 5న కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం, తీసుకునే రుణ మొత్తాన్ని బట్టి బంగారం విలువపై లభించే రుణ శాతం మారుతుంది.
రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకుంటే తాకట్టు పెట్టిన బంగారం విలువలో గరిష్ఠంగా 85 శాతం వరకు పొందవచ్చు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలకు 80 శాతం, రూ.5 లక్షలకు పైబడిన రుణాలకు 75 శాతం వరకు లోన్ లభిస్తుంది. ఉదాహరణకు, తాకట్టు పెట్టిన బంగారం విలువ రూ.లక్ష ఉంటే, మొదటి కేటగిరీలో గరిష్ఠంగా రూ.85 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే, రుణదాత అంచనా, ఇతర అర్హత నిబంధనలు కూడా వర్తిస్తాయి. వినియోగ అవసరాల కోసం తీసుకునే బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ల గరిష్ఠ కాలపరిమితి 12 నెలలు మాత్రమే. ఈ విధానంలో గడువు ముగిసినప్పుడు అసలు, వడ్డీని ఒకేసారి చెల్లించాలి. రుణం తిరిగి చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే అవకాశం రుణదాతకు ఉంటుంది. అయితే, వేలానికి ముందు రుణగ్రహీతకు సమాచారం అందించి నోటీసు ఇవ్వాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!