

దేశంలో సరకు రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ ట్రక్కులను వినియోగంలోకి తీసుకురావడానికి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, టాటా మోటార్స్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ క్యారియర్ భాగస్వామ్య సంస్థలకు టాటా మోటార్స్ 3,000 తేలికపాటి, మీడియం డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కులను సరఫరా చేయనుంది. ఈ వాహనాలను భాగస్వామ్య సంస్థలే నిర్వహించడంతో పాటు అవసరమైన నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతాయి. తొలుత పండుగల సీజన్‌లో ఢిల్లీలో ఈ ట్రక్కుల వినియోగాన్ని ప్రారంభించనున్నారు. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 3,000 ట్రక్కులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు.
తొలి విడత ఎలక్ట్రిక్ ట్రక్కుల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ భాగస్వామ్యాన్ని అభినందించారు. సరకు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణానికి మేలు చేసే, ఇంధనాన్ని ఆదా చేసే రవాణా సాధనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల రంగాల్లో పురోగతి ఆశాజనకంగా ఉందని, వాణిజ్య వాహనాల విభాగంలోనూ విద్యుదీకరణ వేగవంతం కావాలని అన్నారు. ఈ ఒప్పందం దేశంలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల వినియోగాన్ని విస్తృతం చేయడానికి దోహదపడుతుందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కౌల్ ఆశాభావం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!