

విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు శోభిత ధూళిపాళ సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘వేట్టువం’లో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటివరకు శోభిత పోషించిన చాలా పాత్రలు సమాజం ఏమనుకుంటుందోననే భయంతో తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకునేలా ఉన్నాయని ఆమె తెలిపింది. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన శోభిత, గతంలో తాను చేసిన పాత్రల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్‌లోని తారా పాత్రను ఉదాహరణగా తీసుకుంటూ, ఆ పాత్ర తన పరిస్థితుల కారణంగా కోపాన్ని కూడా బహిరంగంగా వ్యక్తం చేయలేక, భావోద్వేగాలను లోపలే అణచుకోవాల్సి వచ్చేదని వివరించింది. సమాజం తనను ఎలా చూస్తుందనే ఆలోచనతో తాను చేసిన పలు పాత్రలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ఉంటాయని పేర్కొంది.
అయితే, ‘వేట్టువం’లోని రాధి పాత్ర తనకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇచ్చిందని శోభిత చెప్పింది. ఎలాంటి భయాలు లేకుండా మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే శక్తిమంతమైన పాత్ర కోసం తాను చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని, ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయాలనే ఆసక్తి తనకు ఎప్పటినుంచో ఉందని తెలిపింది. ప్రపంచం అంతమయ్యే నేపథ్యం, కుటుంబాల మధ్య సంఘర్షణలు, మార్షల్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని వెల్లడించింది. భారతీయ ప్రేక్షకులు ఇంతకుముందు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా పరిచయం చేస్తుందని, ముఖ్యంగా ఇందులోని మార్షల్ ఆర్ట్స్ పోరాటాలు తనను ఎంతో ఆశ్చర్యపరిచాయని శోభిత పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!