

భారతీయ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రం లాస్ ఏంజెల్స్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను జరుపుకుంది. అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లోని డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. థియేటర్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోగా, చిత్ర ప్రధాన బృందం కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఇంగ్లీష్‌లో డబ్ చేసిన 3డీ వెర్షన్‌ను ప్రదర్శించారు. అయితే, అసలు హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్ నిడివి సుమారు 25 నిమిషాలు తక్కువగా ఉందని పలువురు ప్రేక్షకులు పేర్కొన్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ మూడు గంటలకు పైగా ఉండగా, ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం అంతకంటే తక్కువ నిడివితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు వెర్షన్లలో సన్నివేశాలు లేదా ఎడిటింగ్‌లో మార్పులు చేశారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇంగ్లీష్ వెర్షన్‌లో కొన్ని పాటలను తొలగించి ఉండవచ్చని, అందువల్లే నిడివిలో తేడా వచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!