

రుణం తీసుకోవాలనుకునే వారికి క్రెడిట్ స్కోరు ఎంతో కీలకం. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరగడంతోపాటు తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో మంచి క్రెడిట్ స్కోరు ఉండటం మరింత ప్రయోజనకరం. క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యంగా చెల్లించడం, బకాయిలు పెంచుకోవడం, అవసరానికి మించి రుణాలు తీసుకోవడం వంటి అలవాట్లు స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని ఆర్థిక నియమాలను 30 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా క్రెడిట్ నిర్వహణను మెరుగుపరుచుకోవచ్చు.
క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని వాయిదా వేయకుండా, వీలైనంత వరకు పూర్తి బిల్లును గడువులోగా చెల్లించాలి. మిగిలిన బకాయిపై అధిక వడ్డీ పడటంతోపాటు క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వినియోగించకుండా చూసుకోవడం మంచిది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించేందుకు రిమైండర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆటో డెబిట్ సదుపాయం ఉపయోగిస్తే బ్యాంకు ఖాతాలో తగినంత నగదు ఉండేలా చూసుకోవాలి. అలాగే తాజా క్రెడిట్ నివేదికను పరిశీలించి, ఇప్పటికే చెల్లించిన రుణాలు బకాయిలుగా చూపిస్తున్నాయా? ఆలస్యపు చెల్లింపులు తప్పుగా నమోదయ్యాయా? మనకు సంబంధం లేని రుణాలు కనిపిస్తున్నాయా? అనేది తనిఖీ చేయాలి. తప్పులు గుర్తిస్తే సంబంధిత బ్యాంకు లేదా క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేసి సరిచేయించుకోవాలి.
ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులను అనవసరంగా రద్దు చేయకూడదు. సుదీర్ఘమైన క్రెడిట్ చరిత్ర స్కోరు మెరుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే స్కోరు పెంచుకోవాలనే ఉద్దేశంతో అవసరం లేని కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవడం, తక్కువ వ్యవధిలో తరచూ రుణాల కోసం దరఖాస్తు చేయడం మంచిది కాదు. ఈ అలవాట్లను 30 రోజుల పాటు పాటించినంత మాత్రాన క్రెడిట్ స్కోరు తప్పనిసరిగా పెరుగుతుందని హామీ లేదు. బ్యాంకులు చెల్లింపుల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు చేరవేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి బకాయిలను తగ్గించుకోవడం, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ పరిమితిని నియంత్రణలో ఉంచుకోవడం వంటి ఆర్థిక క్రమశిక్షణను నిరంతరం కొనసాగించాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!