

దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు పరిశ్రమ పోటీతత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం కొత్త జాతీయ ఉక్కు విధానాన్ని రూపొందిస్తోంది. ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ కొత్త విధాన ముసాయిదాను వారం రోజుల్లో ప్రజల ముందుకు తీసుకువచ్చి సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. 2047 నాటికి 60 కోట్ల టన్నులకు పైగా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం, 50 కోట్ల టన్నులకు పైగా వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రత్యేక ఉక్కు, విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తిని పెంచడంతో పాటు దిగుమతులకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంపై కూడా విధానంలో దృష్టి పెట్టనున్నారు.
చిన్న ఉక్కు ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు రూ.5,000 కోట్లతో ‘వికసిత్ భారత్ ఇస్పాత్’ పథకాన్ని ప్రతిపాదించారు. ఉత్పత్తి పెంపుతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపును ఆధారంగా చేసుకుని ప్రోత్సాహకాలు అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. పెద్ద ఉక్కు సంస్థల కోసం కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ పథకాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. నాణ్యత లేని చౌక ఉక్కు దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు రక్షణాత్మక, యాంటీ డంపింగ్ సుంకాల వంటి చర్యలను కూడా కొత్త విధానంలో చేర్చనున్నారు. ఇదిలా ఉండగా, 2026–27 ఏప్రిల్–జూన్‌లో భారత ఉక్కు ఎగుమతులు 11 శాతం పెరిగాయని డీజీఎఫ్‌టీ డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!