

దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు సెప్టెంబర్‌లో 14.7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,03,521 కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.1,37,996 కోట్లుగా నమోదైంది. దిగుమతులపై వసూళ్లు 26 శాతం పెరిగి రూ.65,525 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో జీఎస్టీ రీఫండ్‌లు 3 శాతం తగ్గి రూ.27,001 కోట్లుగా నమోదయ్యాయి. రీఫండ్‌ల అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 18.1 శాతం పెరిగి రూ.1,76,520 కోట్లకు చేరాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి రూ.12.46 లక్షల కోట్లకు చేరాయి. నికర వసూళ్లు 10.4 శాతం పెరిగి రూ.10.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో సెప్టెంబర్ దేశీయ జీఎస్టీ ఆదాయం 18 శాతం పెరిగి రూ.5,327 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.4,512 కోట్లుగా ఉంది. ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర రూ.29,986 కోట్లతో అత్యధిక జీఎస్టీ వసూళ్లు నమోదు చేయగా, కర్ణాటక, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!