
హైదరాబాద్‌లో తాగునీటి కొరత లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో మంత్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇటీవల తాను విన్న అత్యుత్తమ జోక్ ఇదేనని ఎద్దేవా చేశారు. ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే తాగునీటి సమస్యపై ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తూ, జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు. రానున్న నెలల్లో హైదరాబాద్‌లో తాగునీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సైతం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో నీటి కష్టాలు రాబోతున్నాయని సీఎం హెచ్చరిస్తుంటే, నీటి కొరత లేదని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ రెండు భిన్నమైన ప్రకటనల్లో ప్రజలు దేనిని నమ్మాలని ప్రశ్నించారు. వచ్చే మార్చిలో హైదరాబాద్‌లో తీవ్ర నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!