

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించడంతో పాటు వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించేందుకు తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు–2026 ప్రదానం చేయనున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్ తెలిపారు. నాలుగు విభాగాల్లో ఎంపికైన వారికి 2027 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేయనున్నట్లు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా అవార్డుల కోసం రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తుల పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించి, దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. డిసెంబర్ 10 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
మాదక ద్రవ్య రహిత తెలంగాణ, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం–సాధికారత, పర్యావరణ పరిరక్షణ, స్టార్టప్‌లు–వినూత్న ఉత్పత్తుల అభివృద్ధి అనే నాలుగు విభాగాల్లో ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని దానకిషోర్ సూచించారు. తెలంగాణకు చెందిన అర్హులైన వ్యక్తులు, రిజిస్టర్డ్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గవర్నర్ అధికారిక వెబ్‌సైట్ https://governor.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని, లేదా సంబంధిత ఆధారాలతో కూడిన దరఖాస్తులను లోక్‌భవన్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9392424483 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని లేదా liasionofficerlbhyd@telangana.gov.in ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని వెల్లడించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!