

సిద్దిపేటకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను రాజకీయ కక్షతోనే నిలిపివేశారని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్ టి. హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.1,070 కోట్ల నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి సిద్దిపేటకు వస్తే తానే స్వయంగా స్వాగతం పలికి సన్మానిస్తానని సవాల్ విసిరారు. ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభోత్సవం కోసం సిద్దిపేటకు రానున్న ముఖ్యమంత్రికి సోమవారం హరీశ్ రావు పలు డిమాండ్లతో బహిరంగ లేఖ రాశారు. 2024 మే 2న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా సిద్దిపేట అభివృద్ధికి సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ అమలుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. సిద్దిపేటలో 22,819 మంది రైతులు అర్హులుగా ఉండగా, వారిలో 20,514 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలని కోరారు. అలాగే, 2026 మార్చి 22న నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 45 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపైనా హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో నిర్వాసితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యల పరిష్కారంపై తగిన శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యత అంశాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు వచ్చిన నివేదికలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సిద్దిపేట అభివృద్ధి పనులు, రైతుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని హరీశ్ రావు తన లేఖలో కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!