

కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగం సోమవారం తెలంగాణ హైకోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. వారి హాజరును నమోదు చేసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 626/2ఏఏలో ఉన్న తమ భూమిపై నిర్మాణాలను అధికారులు కూల్చివేసి, బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ జహానుమా ప్రాంతానికి చెందిన తాజమలుద్దీన్ అలియాస్ మొయినుద్దీన్ ఖాన్ ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ భూమికి సంబంధించి 2024లో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా కమిషనర్, తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, ఇద్దరు అధికారులు ప్రత్యక్షంగా హాజరయ్యేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు సోమవారం కోర్టుకు వచ్చారు. అధికారులు సమర్పించిన సమాధానాలపై కౌంటర్ రిప్లయ్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!