

భారత స్టాక్ మార్కెట్లకు సంబంధించి అమెరికాకు చెందిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ ఆశాజనక అంచనాలను వెల్లడించింది. వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ మరో 12 శాతం పెరిగి 29,000 స్థాయికి చేరుకోవచ్చని పేర్కొంది. గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లోని కంపెనీల రాబడి ఈ ఏడాది 12 శాతం, 2027లో 14 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. చమురు ధరలు తగ్గడం, రూపాయి మళ్లీ పుంజుకోవడం, లిస్టెడ్ కంపెనీల లాభదాయకత పెరగడం, ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు, రుణాల వృద్ధి, ప్రైవేట్ వినియోగం పెరగడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరించడం వంటి అంశాలు మార్కెట్లకు మద్దతుగా నిలవనున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. అయితే షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవడం, దేశీయ విధానపరమైన అవరోధాలు, అంతర్జాతీయ అనిశ్చితులు మార్కెట్ వృద్ధికి అడ్డంకులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీల షేర్లలో అధిక పెట్టుబడులు, వాటి విలువలపై నెలకొన్న బుడగ ఆందోళనల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తున్నారని జేపీ మోర్గాన్ తెలిపింది. అమెరికా సహా ఇతర మార్కెట్లలో ఏఐ సంబంధిత షేర్ల విక్రయాలు పెరిగిన సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) నవంబర్‌లో సుమారు 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత మార్కెట్లకు మళ్లించారు. ఇదే ధోరణి కొనసాగితే భారత ఈక్విటీ మార్కెట్లలోకి మరో 100 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.9.25 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!