

మెటా సంస్థకు వ్యతిరేకంగా అమెరికాలోని 30 రాష్ట్రాలు దాఖలు చేసిన కీలక కేసులో ప్రధాన విచారణ ఆగస్టు 18న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో ప్రారంభమైంది. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను రూపొందించి, వారు ఎక్కువసేపు ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా వాదిస్తున్నాయి.
పుష్ నోటిఫికేషన్లు, రికమెండేషన్ వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, ఇన్ఫినిట్ స్క్రోల్ వంటి ఫీచర్లు యువ వినియోగదారులను పదేపదే యాప్‌లకు తిరిగి వచ్చేలా చేస్తున్నాయని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఈ కేసులో గెలిస్తే కేవలం ఆర్థిక జరిమానాతో సరిపెట్టకుండా యువ వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పనిచేసే విధానంలో కీలక మార్పులు చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి.
టీనేజర్ ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలపై నియంత్రణలు, యువతకు లైక్ కౌంట్లను కనిపించకుండా చేయడం, ఇన్ఫినిట్ స్క్రోల్‌ను పరిమితం చేయడం, రికమెండేషన్ అల్గారిథమ్‌లలో మార్పులు వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అలాగే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లు, ఆటోప్లే వీడియోలు, తాత్కాలిక కంటెంట్‌పై కూడా పరిమితులు విధించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. విచారణ ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది.
అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండించింది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని పేర్కొంది. ఈ కేసులో రాష్ట్రాలకు అనుకూలంగా తీర్పు వస్తే అమెరికాలో పిల్లలు, టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఉపయోగించే విధానంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. లైక్ కౌంట్లు, నోటిఫికేషన్లు, స్క్రోలింగ్, కంటెంట్ సిఫార్సుల వంటి సాధారణ ఫీచర్లపైనా కొత్త నిబంధనలు రావచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!