

రిలేషన్‌షిప్ వివాదం, గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపద భారీగా తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన తొలి 30 నిమిషాల్లోనే ఆయన నికర ఆస్తి విలువ 7.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.70 వేల కోట్లు) తగ్గి 154.7 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ గణాంకాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది. దీంతో బిలియనీర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న హువాంగ్ పదో స్థానానికి పడిపోయారు. బెర్క్‌షైర్ హాత్‌వే మాజీ సీఈఓ వారెన్ బఫెట్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ ఆయనను అధిగమించారు. ఎన్విడియాలో హువాంగ్‌కు సుమారు 3.5 శాతం వాటా ఉంది. అమెరికా రాజకీయ పరిణామాలు, డేటా సెంటర్ల నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశాలు, మదుపర్ల లాభాల స్వీకరణ కారణంగా కంపెనీ షేర్లు ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు హువాంగ్‌కు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధం, చైనా గూఢచర్యం ఆరోపణలు, బోర్డు అంతర్గత విచారణకు సంబంధించిన కథనాలు మదుపర్ల ఆందోళనలను మరింత పెంచినట్లు సమాచారం. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్విడియా షేర్లు నాలుగు శాతానికి పైగా నష్టపోయినట్లు నివేదిక పేర్కొంది.
ఈ వివాదం హువాంగ్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన కంపెనీలో కొనసాగింపుపైనా చర్చకు దారితీసింది. తనపై వచ్చిన రిలేషన్‌షిప్ ఆరోపణల నేపథ్యంలో భార్య లోరి హువాంగ్‌కు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పినట్లు కథనం తెలిపింది. అయితే 1985లో వివాహం చేసుకున్న ఈ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఎలాంటి ధ్రువీకరణ లేదు. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం వివాహ సమయంలో సంపాదించిన ఆస్తుల విభజన విడాకుల ప్రక్రియలో కీలక అంశంగా మారవచ్చని నివేదిక పేర్కొంది. మరోవైపు, ఎన్విడియా బోర్డుకు కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు లేదా కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలితే హువాంగ్ పదవిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఎగుమతి నిబంధనలకు విరుద్ధంగా చైనాకు అధునాతన ఏఐ చిప్‌ల సాంకేతికత చేరినట్లు ఆధారాలు లభిస్తే మరింత తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆరోపణలు, ఊహాగానాలే. హువాంగ్ తప్పు చేసినట్లు నిర్ధారణ అయిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!